విశాల విశ్వం! అందులో కోటానుకోట్ల నక్షత్ర గ్రహగోళాలు! ఎంత పరిశోధించినా ఇంకా ఎంతో తెలుసుకోవలసి వున్న చిత్ర విచిత్ర సృష్టి రహస్యాలు!!

ఈ విశ్వం ఒక అక్షయ, అనంత, అద్భుత, విజ్ఞాన భాండాగారం!

ఎవరు ఏ కోణంలో పరిశోధిస్తే ఆ కోణంలో కనిపించే గారడీ ప్రదర్శన (మ్యాజిక్ షో)!!

అందులో అనంతకోటి జీవరాశి! అనుక్షణం గణాంకాలకు అలవిగానన్ని జీవుల జనన మరణాలు!!

ప్రతి జీవికీ 'నేను' అనే స్ఫురణ వున్న భావన! ఆ భావనవలన సృష్టిలో నిరంతరమూ జరిపే స్పందనలు ప్రతిస్పందనలు!!

రోజులు, మాసాలు, సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు, కల్పాలు - ఇలాగే కొనసాగుతున్న సృష్టి క్రమం!

అలాగే కొనసాగుతున్నా నిన్నటి రోజు ఈ రోజు ఎప్పటికీ కాదు, ఈ రోజు రేపు ఎన్నటికీ కాలేదు. ఇలా గతాన్ని తిరిగి ఇవ్వలేని కాలగతి!

ఇంతటి విశ్వంలోనూ అతి చిన్నది అయిన భూమి మీద ఎన్నో కోట్ల కోట్ల, కోట్ల కోట్ల ఇలా అంతులేని కోటానుకోట్ల భాగమైన అతి చిన్న చలన జీవి మానవుడు!

కానీ ఈ సృష్టిలోని ఏ జీవికీ లేని మానవునికి మాత్రమే వున్న విశిష్టత - మనస్సు! ఈ మనసున్న మనిషికి ఎన్నో ఆలోచనలు! ఎన్నో బంధాలు! ఎన్నెన్నో సంబంధాలు!! వాటి వల్ల కలిగే రాగ ద్వేష కామ క్రోధ అసుయాది భావాలు! వాటి పల్ల కలిగే సుఖదుఃఖాలు!

వాటితో అతలాకుతలమయ్యే మానవ జీవితాలు!! ప్రతి మానవునికి ఏదో పొందాలన్న తపన! పొందలేక పోతున్నామన్న ఆవేదన! అందువలన కలిగే అశాంతి!

ఏమిటి ఈ మానవ జీవితం? ఈ జీవితాలు యిలా గడపవలసినదేనా? దీనికి అంతమెక్కడ? ఈ రహస్యాన్ని ఛేదించాలనుకునేవారు కొందరు. సాధించి మహాత్ములుగా రూపొందినవారు ఏ కొద్దిమందో! అట్టివారే పూజ్యశ్రీ మాస్టరుగారు.

అంతా నశించిపోయేదే అయినప్పుడు ఈ తాపత్రయమేమిటి? మరణించిన తర్వాతది తెలియనప్పుడు మమకారాలెందుకు? అసలీ సృష్టి రహస్యమేమిటి? మానవజీవిత రహస్యమేమిటి? దీనికొక అర్ధము, లక్ష్యము వున్నాయా?

ఇలాంటి ప్రశ్నలతో పూజ్యశ్రీ మాస్టరుగారు సమాధానాల కోసం అన్వేషించారు. సాధించారు. పరిష్కార మార్గాలు గూడ తెలుసుకున్నారు. పరమశాంతిని పొందారు.

అంతటితో ఆగక ఆయన తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆరాటపడ్డారు. వారు ఆ మార్గాల గురించి, కర్తవ్యాల గురించి అనేక విధాలుగా బోధిస్తూ వుండేవారు.

అలా పూజ్యశ్రీ మాస్టరుగారు బోధించిన ప్రవచనాలలో కొన్నింటిని గూర్చి క్లుప్తంగా స్మరించుకుందాము.

1. “పరిశోధించు; సాధించు"
2. "విశ్లేషించు; వివేచించు"
3. "పరిశీలించు; విశ్వసించు"
4. "శరణుపొందు; సేవించు"
5. "శ్రమించు; పంచు"
6. "అచరించు; బోధించు"


వీటిని గురించి పూజ్యశ్రీ మాస్టరుగారు యిలా వివరిస్తూ వుండేవారు....

పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ వ్రాసిన 'మాస్టరుగారు' వ్యాసం (FEB 2025 సంచికలో ముద్రితము) నుండి...